ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు

టిడిపికి యువతరం, యువరక్తం కావాలి

CM Nara Chandrababu Naidu
CM Nara Chandrababu Naidu

కాకినాడ: సిఎం అయిన తొలి రోజు నుంచే జగన్ అరాచకాలను ప్రారంభించారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా తొలి వంద రోజుల్లో ఒక దశాదిశను ఏర్పాటు చేసుకుంటుందని… వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో ప్రజల్లో అప్రతిష్టపాలైందని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని చంపేసే స్థితికి తెచ్చారని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తో ముందుకు వెళ్లే ప్రాజెక్టును దెబ్బతీశారని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి దాడులకు తెగబడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాడులు జరగడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు. వైయస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే చంపినప్పటికీ… ఇంత వరకు ఎవరు చంపారో కనిపెట్టలేక పోయారని ఎద్దేవా చేశారు. టిడిపికి యువతరం, యువరక్తం కావాలని చెప్పారు. ప్రతి సీనియర్ నేత ఒక యువ నాయకుడిని తయారు చేయాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారని జగన్ ను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/