‘నా ఇల్లు నా సొంతం’… టిడిపి పాదయాత్ర

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర

tdp
tdp

పాలకొల్లు: టిడిపి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మహా పాదయాత్రను ప్రారంభించింది. టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ‘నా ఇల్లు నా సొంతం’ పేరుతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాలకొల్లు పట్టణం నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నాయి. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పేదల కోసం తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిపోయినా ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టలేదని విమర్శించారు. ఇళ్ల పంపిణీని ఆలస్యం చేసినందుకు లబ్ధిదారులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో ఇళ్లను నిర్మించామని… ఇప్పుడు సూట్ కేస్ కంపెనీలతో జగన్ నిర్మిస్తున్నారని రామానాయుడు విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైఎస్‌ఆర్‌సిపి నేతలు రూ. 4 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని అన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/