పార్లమెంట్‌ భూమిపూజ..చంద్రబాబు అభినందనలు

దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఉద్ఘాటన

Chandrababu
Chandrababu

అమరావతి: ప్రధాని మోడి ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అభినందనలు తెలిపారు. స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రత్యేక సందర్భం ఓ ముఖ్యమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. మహోన్నతమైన సెంట్రల్ విస్టా నిర్మాణం భారతదేశ ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిందరవందరగా ఉన్న విభాగాలను ఈ సెంట్రల్ విస్టా ఒక్కచోటికి చేర్చుతుందని, కేంద్రీకృత పాలన ద్వారా రెడ్ టేపిజానికి కత్తెర వేస్తుందని తెలిపారు.

అమరావతిలోని ప్రభుత్వ సముదాయం కూడా ఇలాంటిదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. పాలనా వ్యవస్థలన్నీ ఒక్కచోటే ఉండేలా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు రూపకల్పన చేసినట్టు వివరించారు. రాజ్ భవన్, శాసన వ్యవస్థలు, సచివాలయం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్లు… అన్నీ ఒక్కచోటే ఉంటాయని తెలిపారు.

రాష్ట్రంతో పాటు దేశానికి సంపదను సృష్టించే విధంగా ప్రజల ఆకాంక్షలన్నీ ఏకం చేసే ఉద్దేశంతో ఏర్పాటైనదే అమరావతి అని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అమరావతి నాశనం అయిందని, దాని శక్తిసామర్థ్యాలన్నీ వ్యర్థంగా మారిపోయాయని, అందుకు కారణం ప్రస్తుత ప్రభుత్వ తప్పుడు ప్రణాళికలేనని ఆరోపించారు. కానీ, ఏపీ రాజధానిగా అమరావతి అనేది దైవ నిర్ణయం అని, ఏం జరగాలన్నది విధి నిర్ణయిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/