ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సైకిల్ జోరు

ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ జోరు కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, వైస్సార్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ప్రస్తుతం 18,371 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైస్సార్సీపీ పోటీ పడుతున్నాయి. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. మూడు రౌండ్లు ముగిసే సరికి శ్రీకాంత్‌కు 49,173 ఓట్లు రాగా, వైస్సార్సీపీ అభ్యర్థి శ్యామ్‌‌ప్రసాద్‌రెడ్డికి 39,615 ఓట్లు పోలయ్యాయి.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి. ఇక, అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలుపొందగా, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ మద్దుతు కలిగిన చంద్రశేఖర్‌రెడ్డి సుమారు 2 వేల ఓట్లతో విజయం సాధించారు.