టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైస్సార్సీపీ నేత‌ల ల‌క్ష్యం

దాడికి గురైన వారికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుంది..అచ్చెన్నాయుడు

అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే ల‌క్ష్యంగా వైస్సార్సీపీ నేత‌లు ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో త‌మ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడికి గురైన వారికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. వైస్సార్సీపీ నేత‌ల వ‌ల్ల‌ టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేకుండాపోయింద‌ని మండిప‌డ్డారు. ఏపీలో దాడులు, హత్యలు పెరిగిపోయాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఇవి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కళ్లకు కనిపించడం లేదా? అని ఆయ‌న నిల‌దీశారు. జర్మనీలో నాజీలు పాల్ప‌డ్డ దారుణాల‌కు మించి ఇక్క‌డ‌ జగన్ అరాచకాలు ఉన్నాయని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే, కాలం ఎప్ప‌టికీ త‌మ‌కే అనుకూలంగా ఉండ‌బోద‌ని జగన్ అనుచ‌రులు గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వైస్సార్సీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాక‌ 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న దారుణాలు డీజీపీకి క‌నిపించ‌డం లేదా? అని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/