వచ్చేవారం నుంచి దేశవ్యాప్త పర్యటన

పన్ను వేధింపులుంటే సత్వరం పరిష్కరిస్తా

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ పారిశ్రామిక దిగ్గజాల నుద్దేశించి ప్రసంగించారు.పన్ను సంబంధిత అంశాల్లో వేధింపులు ఎదురవుతుంటే, సత్వరం పరిష్కరిస్తామనిసీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఇందుకోసం వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి, పారిశ్రామిక వేత్తలు, వారి ప్రతినిధులతో సమావేశమవుతానని, వారు తెలిపిన పన్ను వేధింపు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ఒకటి అభివృద్ధి చేశామని, దీనివల్ల పన్ను వేధింపు సమస్యలు నేరుగా తాను కూడా పర్యవేక్షించడానికి వీలవుతుందని మంత్రి వెల్లడించారు. ఆర్థిక వృద్ధికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని పరిశ్రమల నిర్వాహకులకు మంత్రి తెలిపారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు జరుగుతుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని వివరించారు.కొంత నెమ్మదించినా, ఇప్పటికీ ప్రపంచంలో వేగవంత వృద్ధి కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశమేనని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య సౌహార్థ పూర్వక సంబంధాలున్నందున, వాణిజ్య సానుకూల వాతావరణం ఇనుమడిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని కష్టపెట్టాలనే అభిప్రాయం ఏ దశలోనూ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/