పండ్లతో వీటిని ట్రై చేయండి !

రుచి: వెరైటీ వంటకాలు


డేట్‌ యాపిల్‌ స్క్వేర్స్‌

Date Apple Squares

కావలసినవి : ఖర్జూరం ముక్కలు-2 కప్పులు (గింజలు తొలగించి, మిరీకలె గుజ్జు చేసుకోవాలి), యాపిల్‌ గుజ్జు-అర కప్పు, బ్రౌన్‌ సుగర్‌-ఒకటిన్నర కప్పులు, నీళ్లు-ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం-1 టేబుల్‌ స్పూన్‌, బటర్‌-1 కప్పు, ఓట్స్‌ పిండి, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి- పావుకప్పు చొప్పున, వాల్‌నట్‌, జీడిపప్పు-2 లేదా 3 టేబుల్‌ స్పూన్లు చొప్పున (మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి తురుము-పావుకప్పు

తయారీ: ముందుగా ఒక పాన్‌ బౌల్‌ తీసుకుని అందులో నీళ్లు, అర కప్పు బ్రౌన్‌ సుగర్‌ వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపటికి ఖర్జూరం గుజ్జు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసుకుని దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో బటర్‌, 1 కప్పు బ్రౌన్‌ సుగర్‌, బియ్యంపిండి, ఓట్స్‌ పిండి, కొబ్బరి తురుము, మొక్కజొన్నపిండి, వాల్‌నట్‌, జీడిపప్పు పౌడర్‌ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత యాపిల్‌ గుజ్జుకూడా వేసుకుని బాగా కలుపుకుని, ఒకటిన్నర లేదా 2 అంగుళాల లోతున్న చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారపు ట్రే తీసుకుని.. అందులో బటర్‌ యాపిల్‌ మిశ్రమాన్ని కొద్ది వేసుకుని, దానిపైన ఖర్జూరం మిశ్రమాన్ని వేసుకుని సమాంతరం చేసుకోవాలి. తర్వాత మిగిలిన బటర్‌ మిశ్రమాన్ని కూడా వేసుకుని మరోసారి సమాంతరం చేసుకుని, 25 నుంచి 30 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకుని కావల్సిన షేప్‌లో కట్‌ చేసుకోవాలి.

Hot cakes

హాట్‌ కేక్స్‌ ..

కావలసినవి :
అరటిపండ్లు-6, మొక్కజొన్నపొడి, బియ్యంపిండి-అరకప్పు చొప్పున, మైదాపిండి-3 టేబుల్‌ స్పూన్లు, పంచదార-2 టేబుల్‌ స్పూన్లు, పాలు- ఒకటిన్నర కప్పులు, నీళ్లు-కొద్దిగా, నూనె-సరిపడా, తేనె-2 గరిటెలు (గార్నిష్‌కి)

తయారీ : ముందుగా 4 అరటిపండ్లు, పాలు ఒక మిక్సీపాత్రలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో మొక్కజొన్న పొడి, బియ్యప్పిండి, మైదాపిండి, పంచదార వేసుకుని, అరటిపండు-పాల మిశ్రామాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకుని, 1 గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత నాన్‌ స్టిక్‌ పాన్‌ తీసుకుని, నూనె వేసుకుని, ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకుని, చిన్నచిన్న పాన్‌ కేక్స్‌ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అరటిపండ్లను నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుని, తేనెతో గార్నిష్‌ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే.. భలే టేస్టీగా ఉంటాయి. అభిరుచిక బట్టి ఇష్టమైన ఫ్రూట్స్‌తో ఈ పాన్‌కేస్‌ కలిపి సర్వ్‌ చేసుకోవచ్చు.

Coconut Truffle .

కోకోనట్‌ ట్రఫిల్‌ ..

కావలసినవి : కొబ్బరి తురుము-ముప్పావు కప్పు+4 టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 కప్పులు, తేనె-4 టేబుల్‌ స్పూన్స్‌, బటర్‌-1 టేబుల్‌ స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రా – అర టీస్పూన్‌.

తయారీ : ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, బౌల్‌లో కొబ్బరి పాలు, తేనె వేసుకుని.. కొబ్బరిపాల మిశ్రమం దగ్గర పండేంత వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అందులో బటర్‌, కొబ్బరి తురుము, వెనీలా వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ దించుకుని కాస్త చల్లారగానే.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చుట్టి.. మిగిలిన కొబ్బరి తురుముని వాటికి బాగా పట్టించి సర్వ్‌ చేసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/