తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది

తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది..పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే మందు బాబులు ఏకంగా రూ.443 కోట్ల మందును తాగేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ మద్యం అమ్మకాలను ముందే ఊహించిన సర్కార్‌.. మద్యం స్టాకు కూడా పెంచింది. దీంతో అన్ని చోట్ల తమకు కావాల్సిన మద్యం దొరకడం తో మందు ప్రియులు సంబరాలు చేసుకున్నారు.

దీపావళికి ముందు రోజు.. దీపావళి నాడు మద్యం విక్రయాలను చుస్తే.. 3వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా రూ.213.61 కోట్ల మేర మద్యాన్ని విక్రయించారు. చెన్నైలో రూ.38 కోట్లు, మదురైలో రూ.47.21 కోట్లు, సేలంలో రూ.44.27 కోట్లు, తిరుచ్చిలో రూ.43.38 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.75 కోట్లు మేరకు టాస్మాక్‌ దుకాణాలలో మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక 4న ఏకంగా రూ.228.42 కోట్ల మేరకు మద్యం అమ్మకాలుసాగాయి. చెన్నైలో రూ.41.84 కోట్లు, మదురైలో రూ.51.68 కోట్లు, సేలంలో రూ.46.62 కోట్లు, తిరుచ్చిలో రూ.47.57 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.71 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు.