బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన తరుణ్ చుగ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.
రోజు రోజుకు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు.

కేసీఆర్ కు ప్రజల్లో ప్రజాదరణ తగ్గుతుందని, సంజయ్ పాదయాత్రకు ప్రజల మద్దతు పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై సంజయ్ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాడని, సమస్యలు బయటకు రాకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేతలు మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ స్పందించారు. యాత్రను నిలిపివేసే ప్రసక్తే లేదని.. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని.. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఆంక్షలు పెట్టినా అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి తెలిపారు.