తారకరత్న కు మాత్రమే ఆ రికార్డు దక్కింది

గుండెపోటుతో మరణించిన తారకరత్న ..సినీ జీవితంలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని రికార్డు ను సాధించారు. తారకరత్న 2002లో ఒకటో నెంబరు కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు. అమరావతి చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. నటుడిగా ఎప్పటికప్పుడు తనను తానూ కొత్తగా ఆవిష్కరిస్తూనే వచ్చాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఫలితం తేడా కొట్టినా ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇక ఇదిలా ఉంటే తారకరత్న పేరిట ఒక రేరెస్ట్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేదు.

అదేంటంటే తారకరత్న 2002లో ఒకేసారి తొమ్మిది సినిమాలతో లాంచ్ అయ్యాడు. ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఇన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో అనే రేరెస్ట్ రికార్డు ఇంకా తారకరత్న ఖాతాలోనే ఉంది. ముహూర్తం పూర్తి చేసుకున్న తొమ్మిది సినిమాల్లో ఐదు మాత్రమే విడుదలకు నోచుకున్నాయి. కెరీర్‌ బిగెనింగ్‌లో లవర్‌ బాయ్‌ పేరుతెచ్చుకున్న తారకరత్న.. రవిబాబు ప్రోత్సాహంతో ‘అమరావతి’ సినిమాతో విలన్‌గా మారి కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఈ సినిమాలో తారకరత్న నటనకు విలన్‌గా నంది అవార్డు వరించింది.

తారకరత్న నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. దాదాపు 23 రోజుల నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. శివరాత్రి రోజు కన్నుమూశారు. తారకరత్న అకాల మరణం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది. ఎంచక్కా ఓవైపు సినిమాలు చేసుకుంటూ, మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా మారేందుకు రెడీ అయిన వ్యక్తి.. ఇలా అకస్మాత్తుగా తనువు చాలించడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు.