తారకరత్న ను ఆఖరి చూపు చూసేందుకు ఫిలిం ఛాంబర్ కు తరలివస్తున్న అభిమానులు

తమ అభిమాన నటుడ్ని ఆఖరిసారి చూసేందుకు నందమూరి అభిమానులు , సినీ అభిమానులు పెద్ద సంఖ్య లో ఫిలిం ఛాంబర్ తరలివస్తున్నారు. శనివారం రాత్రి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈయన గుండెపోటుకు గురికావడం తో బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి కోమాలోనే ఉండిపోయారు. విదేశీ డాక్టర్స్ సైతం తారకరత్న ఆరోగ్యం కుదుటపడేలా తీవ్రంగా శ్రమించారు కానీ కుదరలేదు. దాదాపు 24 రోజులపాటు చికిత్స అందించారు. కానీ తారకరత్న ను బ్రతికించలేకపోయారు.

చివరకు ఫిబ్రవరి 18 మహాశివరాత్రి రోజున కన్నుమూశారు. ఆ తర్వాత బెంగుళూర్ నుండి ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ లోని మోకిలాలోని తారకరత్న నివాసానికి తరలించారు. తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళ్లు అర్పించారు. సోమవారం ఉదయం ఫ్రీజర్‌ నుంచి తారకరత్న దేహాన్ని బయటకు తీసి ఆయన కుమారుడి చేతుల మీదుగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇంటినుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు అభిమానుల సందర్శనార్థం తీసుకొచ్చారు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి అంబులెన్స్ లో తారకరత్న భౌతికకాయం పక్కనే కూర్చున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించుకునేందుకు పలువురు రాజకీయనాయకులు, అభిమానులు, భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

ఫిలిం ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహానికి మంత్రి తలసాని నివాళులర్పించారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్న మంత్రి.. 40 ఏళ్ల వయసులోనే ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న 20 సంవత్సరాల వయస్సులోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారని, 23 సినిమాల్లో నటించారని చెప్పారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తారక రత్న అజాత శత్రువు అని సినీ హీరో శివాజీ అన్నారు. అందరినీ బాబాయ్ అని పిలిచే తారకరత్న మన మధ్య లేకపోవడం బాధాకరమని చెప్పారు. తనకు తారకరత్న మంచి మిత్రుడని, మంచి లీడర్ అయ్యే వాడని తెలిపారు.