ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

రెండో రోజు కూడా ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. ఇంకా వేలాది విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంది. నగరంలోని కొన్ని మండపాల నిర్వాహకులు నిన్న శుక్రవారం కావడంతో వినాయకులను ఈరోజు నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు సైతం ఇతర చోట్లకు విగ్రహాలను పంపిస్తున్నారు. మరోపక్క నిమజ్జనం చేసి తిరిగి వెళ్లేవారు సైతం ట్రఫిక్ లో చిక్కుకున్నారు. సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు.

తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు . నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వర్షం కురవడంతో నిమజ్జనం ఆలస్యంగా కొనసాగుతుంది. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 20 -30 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈరోజు మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.