ఏపీ హోం మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టిన తానేటి వ‌నిత

క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని వెల్ల‌డి

అమరావతి : తానేటి వనిత ఈరోజు ఏపీ హోం శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జ‌గ‌న్ తొలికేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేసిన తానేటి వ‌నితకు కేబినెట్ రీష‌ఫిలింగ్‌లోనూ అవ‌కాశం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా శాఖ‌ల కేటాయింపుల్లోనూ ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్న వ‌నిత ఏకంగా హోం మంత్రిత్వ శాఖ‌ను చేజిక్కించుకున్నారు. ఇటీవ‌లే రెండో సారి మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన వ‌నిత‌… తాజాగా సోమ‌వారం హోం శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ .. సీఎం జగన్‌ అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్న వ‌నిత‌.. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాన‌ని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/