వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి తానేటి వనిత

వరదల ఫై టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు వైస్సార్సీపీ మంత్రి తానేటి వనిత. ఇటీవల కురిసిన భారీ వర్షాలు , ఎగువ నుండి వచ్చిన భారీ వరదలతో గోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ముంపుకుగురయ్యాయి. ఈ క్రమంలో చంద్రబాబు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు పర్యటన లో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు పడవ బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నది నీళ్లల్లో పడిపోయారు. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీపంలోనే జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అప్పటికే చంద్రబాబు మరొక బోటులోకి మారడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పట్ల టీడీపీ నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పర్యటనకు కనీస భద్రత కల్పించలేదని మండిపడుతున్నారు. ఇక దీనిపై ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు.

పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని వనిత తెలిపారు. టీడీపీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించటానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో గోదావరి నదిలో 25 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న సమయంలోనే ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చంద్రబాబు పడవ బోల్తా ఘటన జరిగిందంటూ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పడవలపై వెళ్లారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని..గోదావరిలో మునిగి పోయిన టీడీపీ నేతలను కాపాడింది మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటూ వనిత పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు వరదల పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.