విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన గవర్నర్ తమిళిసై

విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి గవర్నర్ తమిళిసై వార్తల్లో నిలిచారు. త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు డాక్టర్ గా ప‌ని చేశార‌న్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక వైద్య వృత్తి చేప‌ట్టే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో ఆమె తనలోని వైద్యురాలిని బయటకు తీశారు.

ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో… విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. విషయం తెలిసిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.

బాధితుడు కోలుకున్నాక‌… విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచ‌న‌లు చేశారు. విమానం బ‌య‌లుదేరే ముందే ప్ర‌యాణికుల్లో డాక్ట‌ర్లు ఉన్న‌ట్లయితే… ముందుగా చార్ట్‌లోనే విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని ఆమె సూచించారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయగలిగేలా సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కూడా ఆమె ఇండిగో సంస్థకు సూచించారు.