తమిళనాడు లో లాక్‌డౌన్‌ పొడగింపు!

చెన్నై : జూలై 5వ తేదీ వరకు తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో మూడు జిల్లాలకు ప్రత్యేకంగా సడలింపులు ఇచ్చింది. యాక్టివ్‌ కేసుల ఆధారంగా రాష్ట్రంలోని 38 జిల్లాలను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. మొదటి కేటగిరిలో 11 హాట్‌స్పాట్‌ జిల్లాలు ఉన్నాయి. రెండో కేటగిరిలో తక్కువ యాక్టివ్‌ కేసులున్న జిల్లాల్లో 23 ఉన్నాయి. మూడో కేటగిరిలో చెన్నై సహా పొరుగున ఉన్న మూడు జిల్లాలను చేర్చింది. ఇక్కడ కరోనా తీవ్రత గణనీయంగా మెరుగుపడింది.

ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చెన్నై, పొరుగు జిల్లాలైన తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాల్స్‌ తెరిచి ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా జిల్లాల్లో వస్త్ర, ఆభరణాల దుకాణాలను తెరిచేందుకు అనుమతి జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో పని చేయొచ్చని, ఎయిర్‌ కండీషనర్లను ఉపయోగించొద్దని ఆదేశించింది. రెస్టారెంట్లలో పార్సిల్‌ సేవలకు అనుమతి ఇవ్వగా.. మాల్స్‌, సినిమా థియేటర్లు మూసి ఉండనున్నాయి. ఆయా జిల్లాల్లో ఇంతకు ముందు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన దుకాణాలు సైతం రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/