గృహిణులకు కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకం

ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళకు ప్రతి నెల 1000 రూపాయలు!

Tamil Nadu Budget: Rs 1,000 aid for women family heads will be launched in Sept 2023, says govt

చెన్నైః మహిళల కోసం బడ్జెట్‌లో తమిళనాడు ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళల కోసం ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ. 1000 చొప్పున పంపిణీ చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులైన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అన్నాదురై జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిని ప్రారంభిస్తారు.

తమిళనాడు అసెంబ్లీలో నిన్న ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో ఈ పథకాన్ని ప్రస్తావిస్తూ వివరాలు వెల్లడించారు. ఈ పథకం కోసం రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న మహిళలకు ఈ పథకం ద్వారా కొంత ఊరట లభిస్తుందన్నారు. అర్హులైన మహిళల ఎంపిక ఎలా అన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.

మరోవైపు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమిళ సైనికులకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు. అలాగే, సేవా పతకాలు పొందిన తమిళ సైనికులకు ఇచ్చే గ్రాంటును నాలుగు రెట్లు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు.