త‌మిళ‌నాడు అసెంబ్లీలో నేడు ఓ కీల‌క తీర్మానం

శ్రీలంక‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా..ఏక‌గ్రీవ తీర్మానం చేసిన సీఎం స్టాలిన్


చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఇవాళ ఓ కీల‌క తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. శ్రీలంకకు మానవతా సహాయం పంపేందుకు రాష్ట్రాన్ని అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.. రాష్ట్ర డీఎంకే ప్రభుత్వం గతంలో శ్రీలంక తమిళులకు మాత్రమే కీలకమైన సామాగ్రిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.

కాగా స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ద్వీప దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తోందని, ప్రజలకు అందుబాటులో లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. శ్రీలంక పరిస్థితిని మరొక దేశానికి సంబంధించిన అంశంగా చూడలేమని, “మేము సహాయం అందించాలి” అని స్టాలిన్ తెలిపారు. శ్రీలంక తమిళులకు అవసరమైన సామాగ్రిని అందించాలనే తన మునుపటి నిర్ణయాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.40,000 టన్నుల ధాన్యం (రూ. 80 కోట్లు), మందులు (రూ. 28 కోట్లు), 500 టన్నుల పాలపొడి (విలువ రూ. 15 కోట్లు) శ్రీలంకకు రవాణా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని స్టాలిన్ తెలిపారు.కాగా రాష్ట్రం నేరుగా శ్రీలంకకు వస్తువులను బదిలీ చేయలేనందున, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ..ద్వీప దేశంలోని భారత హైకమిషన్ ద్వారా పంపాల‌ని స్టాలిన్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/