తాలిబన్‌ అమెరికాతో శాంతి ఒప్పందం!

US-Taliban
US-Taliban

వాషింగ్టన్‌ : జనవరి చివరి నాటికి అమెరికాతో కాల్పుల ఉపసంహరణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాలిబన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తమ సైనిక కార్యకలాపాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాలిబన్‌ ప్రధాన ప్రతినిధి తెలిపినట్టు సమాచారం. తాజాగా దోహా వేదికగా తాలిబన్‌, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారు కొద్దిరోజుల పాటు కాల్పుల విరమణకు ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో అర్ధంతరంగా చర్చలు ముగించిన అధ్యక్షుడు ట్రంప్‌.. ఇటీవలే పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కుదిరితే అఫ్ఘాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, 18 ఏండ్ల సుదీర్ఘ మిలిటరీ ఒప్పందానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్ఘాన్‌లో 12వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇటీవలే డిసెంబరులో ఖతార్‌ వేదికగా ఇరు పక్షాల మధ్య చర్చలు పున్ణప్రారంభమయ్యాయి. కాగా… అఫ్ఘాన్‌ బాగ్రామ్‌లోని అమెరికా సైనిక స్థావర సమీపంలో జరిగిన దాడి తర్వాత చర్చలకు మళ్లీ కొద్ది రోజుల విరామం వచ్చింది. అనంతరం.. మళ్లీ దోహా చర్చల్లో శాంతి ఒప్పందం దిశగా ముందడుగు వేసినట్టు సమాచారం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/