టాక్సీ డ్రైవర్లకు తాలిబన్‌ ఆదేశం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్‌ తాజాగా టాక్సీ డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. తుపాకులు కలిగిన ఇతరులను వాహనాల్లో తరలించవద్దని పేర్కొంది. తాలిబన్‌, అనుబంధ వ్యక్తులు తప్ప ఇతర గన్‌మెన్‌లను టాక్సీలలో తరలించవద్దని తూర్పు నంగర్హర్ ప్రావిన్స్‌లోని టాక్సీ డ్రైవర్లను ఆదేశించింది. అలాగే టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్‌మెన్‌లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రావిన్స్ ప్రజలను తాలిబన్‌ కోరింది. ప్రజల భద్రత కోసం తమకు సహకరించాలంటూ నంగర్హర్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబన్‌ అధికారి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రావిన్సులలో చురుకుగా ఉన్న ఐఎస్‌ఐఎస్‌-కే ఉగ్రవాదులు ఇటీవల తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని పలు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో తాలిబన్లతోపాటు పౌరులు కూడా మరణిస్తుండటంతో స్థానికుల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ఈ నేపథ్యంలో తాలిబన్‌ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/