ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు సహా గళమెత్తిన ప్రజలు

తాలిబన్లకు చావుతప్పదంటూ ఆగ్రహం

కాబుల్ : తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లు రోడ్డెక్కుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్న పాకిస్థాన్ ను తిట్టిపోస్తున్నారు. కాబూల్, మజారీ షరీఫ్ నగరాల్లో మహిళలు సహా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన దళాలకు మద్దతుగా నిలిచారు. పంజ్ షీర్ కే తమ మద్దతు అని, తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు.

‘‘తాలిబన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్ కూ మరణ శిక్ష తప్పదంటూ నినదించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు ఇలా పదం కదిపి కదం తొక్కారు.

విదేశీ అరాచక శక్తులతో తాలిబన్లు చేతులు కలిపారని, దీనిపై దేశంలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంతా ఏకం కావాలని అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు. కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పాక్ రాయబార కార్యాలయం ముందు కూడా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. ‘పాకిస్థాన్, తాలిబన్లకు మరణ శిక్ష’ అంటూ నినదించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/