ఆఫ్ఘన్ లో మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్న తాలిబన్లు

ప్రాణభయంతో వణికిపోతున్న 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు


కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక జైళ్ల నుంచి విడుదలైన నేరస్థులు తమకు శిక్ష వేసి జైలుకు పంపిన మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష విధించిన వారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తుండడంతో మహిళా న్యాయమూర్తులు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే దేశం దాటిపోగా, ఎటూవెళ్లలేక ఆప్ఘన్‌లోనే ఉన్నవారు రహస్య ప్రాంతాలకు చేరుకుని ప్రాణాలు నిలుపుకునేందుకు తంటాలుపడుతున్నారు.

ఆఫ్గనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక జైళ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. ఇలాంటి వారిలో గతంలో తాలిబన్లతో కలిసి పనిచేసిన వారు కూడా ఉన్నారు. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి అప్పట్లో మహిళా న్యాయమూర్తులు శిక్షలు విధించి జైళ్లకు పంపారు. దీనిని మనసులో పెట్టుకున్న వారు జైలు నుంచి బయటకు రాగానే తమకు శిక్షలు విధించిన న్యాయమూర్తులకు హెచ్చరికలు పంపారు. ప్రతీకారం తప్పదని బెదిరించారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో వణికిపోతూ రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/