తాలిబన్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు పాక్, చైనా, రష్యాల‌కు ఆహ్వానం

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్నారు తాలిబ‌న్లు. సోమ‌వారం చివ‌రి పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను కూడా చేజిక్కించుకున్నామ‌ని ప్ర‌క‌టించుకున్న తాలిబ‌న్లు.. ఇక ప్ర‌భుత్వానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి పాకిస్థాన్‌తోపాటు చైనా, ర‌ష్యా, ట‌ర్కీ, ఖ‌తార్‌, ఇరాన్‌ల‌ను తాలిబ‌న్లు ఆహ్వానించ‌డం గ‌మనార్హం. సోమ‌వారం ఉద‌యం తాము పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, ఇక యుద్ధం ముగియ‌డంతో సుస్థిర‌మైన ఆఫ్ఘ‌నిస్థాన్ దిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్లు తాలిబ‌న్ల అధికార ప్ర‌తినిధి జ‌బీహుల్లా ముజాహిద్ చెప్పాడు.

ఇక నుంచి ఎవ‌రు ఆయుధాలు చేత ప‌ట్టినా.. వాళ్లు ప్ర‌జ‌ల‌కు, దేశానికి శ‌త్రువులే అని అత‌డు ప్ర‌క‌టించాడు. దేశంలోకి చొర‌బ‌డిన వాళ్లు ఎప్ప‌టికీ దేశాన్ని పున‌ర్నిర్మించ‌లేర‌ని, దేశ ప్ర‌జ‌లే ఆ ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చాడు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఖ‌తార్‌, ట‌ర్కీ, యూఏఈ త‌మ ఆప‌రేష‌న్లు ప్రారంభించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కూడా వెల్ల‌డించాడు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/