తాలిబన్ల పాలనతో మళ్లీ స్వేచ్ఛను కోల్పోయిన ఆఫ్ఘన్ మహిళలు

మహిళా మంత్రిత్వ శాఖ పేరు మార్పు


కాబుల్ : గత 20 ఏళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆప్ఘనిస్థాన్ మహిళలకు మళ్లీ గడ్డుకాలం ఎదురైంది. తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. షరియా చట్టాల పేరుతో మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. వారిపై పలు ఆంక్షలను విధించారు. తొలుత బాలికలకు విద్యను నిరాకరించిన తాలిబన్లు ఒక మెట్టు దిగారు. అమ్మాయిలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని… ఒకవేళ కోఎడ్యుకేషన్ కొనసాగినా… అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరను ఏర్పాటు చేయాలని షరతు విధించారు.

తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చేశారు. గత 20 ఏళ్లుగా ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి ‘ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన’ శాఖ అని పేరుపెట్టారు. ఈ మేరకు అరబ్బీ, దరి భాషల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. తాలిబన్ల కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇటీవలే విమానాశ్రయ సెక్యూరిటీలో 16 మంది మాజీ మహిళా ఉద్యోగులను మళ్లీ నియమించిన తాలిబన్లు… ఇతర శాఖలు, సంస్థల్లో మాత్రం మహిళలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/