తైవాన్ పూర్తిగా మా అంతర్గత విషయం: చైనా

బీజింగ్: తైవాన్ విషయంలో చైనాను అమెరికా మరోమారు హెచ్చరించింది. ఆ దేశంపై కనుక దాడికి దిగితే తాము చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించారు. తమ బలం ఏపాటిదో చైనా, రష్యాకు కూడా ఎరుకేనని అన్నారు. తామైతే కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని అయితే, తీవ్రమైన తప్పిదాలకు దారితీసే చర్యలకు చైనా ఎక్కడ పాల్పడుతుందోనన్నదే తమ ఆందోళన అని బైడెన్ అన్నారు. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని, తమ అభిప్రాయాలు మారబోవని స్పష్టం చేశారు. తైవాన్‌పై కనుక చైనా దాడికి దిగితే స్పందించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.

మరోవైపు, అమెరికా వ్యాఖ్యలపై చైనా కూడా అంతే దీటుగా స్పందించింది. తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పష్టం చేశారు. తైవాన్ పూర్తిగా తమ భూభాగానికి చెందినదని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని అన్నారు. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ చైనా ఇటీవల తరచూ చేస్తున్న వ్యాఖ్యలే రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/