బండి సంజయ్‌పై స్వామి గౌడ్‌ ఫైర్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటి తో ముగుస్తుండడం తో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం బంగారిగడ్డ లో టిఆర్ఎస్ నిర్వహించిన సభ లో కేసీఆర్ బిజెపి ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్ వ్యాఖ్యల కు బిజెపి నేతలు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ పట్ల టీఆర్‌ఎస్‌ నేత స్వామి గౌడ్‌ మండిపడ్డారు.

తాము అమ్ముడు పోయే వాళ్లమే అయితే.. లొంగిపోయే వాళ్లమే అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాళ్లమే కాదని ఉద్ఘాటించారు. ఉద్యమ సమయంలో తమ మీద ఆరోపణ చేసిన వాళ్లు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన తెలంగాణ పోరు యాత్రలో ఆయన వెంట నడిచామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు బండి సంజయ్ కనీసం కనిపించనుకూడా లేదని స్వామిగౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై బండి సంజయ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.