మైదానంలో కొట్టుకున్న హాకీ ఆటగాళ్లపై వేటు

మైదానంలో కొట్టుకున్న హాకీ ఆటగాళ్లపై వేటు
Hockey

న్యూఢిల్లీ: మైదానంలో పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్న ఘటనకు సంబంధించి 11మంది ఆటగాళ్లను భారత హాకీ ఇండియా క్రమశిక్షణ సంఘం సస్పెండ్‌ చేసింది. వారితో పాటు ఇద్దరు అధికారులపై వేటు వేసింది. ఈ మధ్యే జరిగిన 56వ నెహ్రూకప్‌లో పంజాబ్‌ సాయుధ పోలీసులు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ మధ్యలో చిన్న వివాదం తలెత్తి రెండు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పడి పిడిగుద్దులు కురిపించారు. హాకీ కర్రలతో మైదానంలోనే కొట్టుకున్నారు. ఈ ఘటన అందరినీ నివ్వెరపరిచింది.

హాకీ ఇండియా రంగంలోకి దిగి ఏమైందో నివేదిక కోరింది. నివేదికలు, వీడియో సాక్ష్యాలను హాకీ ఇండియా ఉపాధ్యక్షుడు భోలానాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని క్రమశిక్షణ సంఘం పరిశీలించింది. రెండు జట్లకు సంబంధించి 11మంది ఆటగాళ్లను పొరపాటు స్థాయిని బట్టి 12-18, 6-12 నెలలు సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది. పంజాబ్‌ సాయుధ పోలీసుల జట్టుకు చెందిన హర్దీప్‌ సింగ్‌, జస్‌కరణ్‌ సింగ్‌కు 18 నెలలు, దూపీందర్‌దీప్‌ సింగ్‌, జగ్మీత్‌ సింగ్‌, సుఖ్‌ప్రీత్‌ సింగ్‌, సర్వజిత్‌ సింగ్‌, బల్లిందర్‌ సింగ్‌కు 12 నెలల సస్పెన్షన్‌ విధించారు.

2019, డిసెంబర్‌ 11 నుంచి శిక్ష అమలవుతుంది. పోలీస్‌ జట్టు మేనేజర్‌ అమిత్‌ సంధుపై 18 నెలల సస్పెన్షన్‌ వేటు పడింది. పంజాబ్‌ బ్యాంకు ఆటగాళ్లు సుఖ్‌జీత్‌ సింగ్‌, గుర్‌సిమ్రన్‌ సింగ్‌, సుమిత్‌ టప్పొ (12 నెలలు), జస్బీర్‌సింగ్‌ (6 నెలలు), మేనేజర్‌ సుశీల్‌ కుమార్‌ దూబె(6నెలలు)ను సస్పెండ్‌ చేశామని హాకీ ఇండియా తెలిపింది. ఆటగాళ్లపైనే కాకుండా జట్లపైనా వేటు పడింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/