ఏపీ సినిమా టికెట్స్ ధరల ఫై సురేష్ బాబు స్పందన

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇకపై ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి రానుంది. తద్వారా ప్రభుత్వం నిర్దేశించిన మేరకే టికెట్ల ధరలు ఉంటాయి. గతంలో మాదిరి ఇష్టంవచ్చినట్టు టికెట్ల ధరలు పెంచుకోవడం ఇక కుదరదు. అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ నిర్ణయం ఫై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు స్పందించగా..తాజాగా నిర్మాత సురేష్ బాబు స్పందించారు.

సురేష్ బాబు మాట్లాడుతూ..ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడమే చాలా కష్టంగా ఉందని.. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని.. అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బి సి సెంటర్స్ లో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో వస్తువుని బట్టి ఒక్కో రేటు ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుందని సురేష్ బాబు ప్రశ్నించారు.

పెద్ద సినిమాల బడ్జెట్ వేరు.. చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకూ ఒకే రేటు నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.