పెండింగ్ బిల్లుల కేసులో తెలంగాణ సర్కార్‌కు ఊరట..

పెండింగ్ బిల్లుల కేసులో తెలంగాణ సర్కార్‌కు ఊరట దక్కింది. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టటంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెండింగ్ బిల్లులకు వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్ట్..బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించింది.

గవర్నర్‌ తరఫున సొలిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఎలాంటి బిల్లులు లేవని, కొన్ని బిల్లులను తిప్పి పంపారంటూ తెలిపారు. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం పెండింగ్‌లో బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు.. గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని తెలిపింది.