ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

శిక్ష వాయిదాపై ప్రశాంత్ భూషణ్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court – Prashant Bhushan

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు ఈనెల 14న నిర్ధరించిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ భూషణ్, శిక్ష వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. శిక్ష ఖరారు చేసిన తర్వాతే క్రిమినల్ ధిక్కారానికి సంబంధించిన కేసుపై తీర్పు ఫూర్తి అవుతుందని తెలిపింది. కాగా, ప్రశాంత్ భూషణ్ తరుఫున కోర్టుకు హాజరైన న్యాయవాది దుష్యంత్ దేవ్ తన వాదనలు వినిపించారు. న్యాయ సమీక్ష కోసం అప్పీల్ చేయడం సరైనదేనని, ఈ నేపథ్యంలో శిక్షను వాయిదా వేయవచ్చని చెప్పారు. శిక్ష వాయిదా వేసినంత మాత్రానా స్వర్గం ఊడిపడదు అని ఆయన వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ సమీక్ష పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకు అది అమలులోకి రాదని చెప్పింది. మీ పట్ల న్యాయంగానే వ్యవహరిస్తామని ధర్మాసనం పేర్కొంది. మీరు బెంచ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నామని తెలిపింది. న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కారంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఆయనను దోషిగా ఇటీవల నిర్ధారించింది. అయితే శిక్ష ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు తనను దోషిగా నిర్ధారించడంపై ప్రశాంత్ భూషణ్ సమీక్ష కోరారు. ఆయన రివ్యూ పిటిషన్ పై విచారణకు కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సమీక్ష పిటిషన్ పై నిర్ణయం వెలువడేంత వరకు కోర్టు ధిక్కార కేసులో శిక్షను వాయిదా వేయాలన్న ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/