దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపులే : సుప్రీంకోర్టు

స్కిన్ టు స్కిన్ టచ్ చేస్తేనే లైంగిక వేధింపులన్న ముంబై హైకోర్టు తీర్పుపై మండిపడిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందుతుడు ఓ బాలిక శరీరాన్ని డైరెక్ట్ తాకనప్పుడు (స్కిన్ టు స్కిన్) అది పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదన్న కోర్టు తీర్పుపై మండిపడింది. వస్త్రాల మీది నుంచి తాకినా దానిని లైంగిక వేధింపులుగానే పరిగణించాలని తేల్చి చెప్పింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పునిచ్చిందని పేర్కొంది. చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు నిబంధనల పేరిట కోర్టులు గందరగోళానికి తెరలేపకూడదని జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే పోక్సో చట్టం ఉద్దేశమని, అత్యాచారం చేయాలన్న దురుద్దేశంతో బాలికను నిందితుడు వస్త్రాలపై నుంచి తాకినా దానిని నేరం కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. నిందితుడు శరీరాన్ని నేరుగా తాకాడా? లేదా? అన్న దానిపై చర్చ పెట్టడం సరికాదని పేర్కొంది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

కాగా, 2016లో సతీశ్ అనే వ్యక్తి పండు ఇప్పిస్తానని ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక ఛాతీని తాకి దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి పరుగున వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సెషన్స్ కోర్టు విచారించి.. సతీశ్ ను దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పును సతీశ్ .. బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. విచారించిన నాగ్ పూర్ బెంచ్.. దుస్తులపై నుంచి ఒంటిని తాకినంత మాత్రాన దానిని లైంగిక వేధింపులుగా భావించలేమంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తీర్పునిచ్చారు. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ శిక్షను రద్దు చేశారు. దీనిపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పును రివర్స్ చేయాలని అభ్యర్థిస్తూ అటార్నీ జనరల్ తో పాటు మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/