ఢిల్లీలో ఆస్ప‌త్రుల నిర్మాణాలు కొన‌సాగించేందుకు అనుమతి :సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆస్ప‌త్రుల నిర్మాణాలు కొన‌సాగించేందుకు అక్క‌డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమ‌తించింది. ఢిల్లీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌డుతున్న ఆస్ప‌త్రుల నిర్మాణాన్ని కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కోర్టు త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. ఢిల్లీతోపాటు నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ అంత‌టా వాయు కాలుష్యం పెరిగిపోయింది. వాహ‌నాలు, ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువ‌డే పొగ‌, రైతులు త‌మ పొలాల్లో కొయ్యకాలు కాల్చ‌డం లాంటివి కాలుష్యానికి కార‌ణ‌మ‌ని తేల్చారు.

అదేవిధంగా భ‌వ‌న నిర్మాణ ప్రాంతాల నుంచి వెలువ‌డే దుమ్ముధూళి కూడా వాయు కాలుష్యానికిగ‌ల కార‌ణాల్లో ఒకటిగా గుర్తించారు. అందుకే ఢిల్లీలో భ‌వ‌న నిర్మాణాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ క్ర‌మంలో ఢిల్లీ ప్ర‌భుత్వం ఆస్ప‌త్రుల నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దాంతో ఆస్ప‌త్రుల నిర్మాణం కొన‌సాగించేందుకు కోర్టు అనుమ‌తించింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10కి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/