పోలవరంపై తాజా నివేదికను సమర్పించండి

ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

Polavaram Project
Polavaram Project

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై తాజా నివేదిను సమర్పించాలని ఏపి ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల అభ్యంతరాలు, సందేహాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కాగా పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీంలో విచారణ జరుగుతుంది. బచావత్‌ అవార్డుకు భిన్నంగా ఈ ప్రాజెక్టును మార్చారని ఒడిశా ఆరోపించింది. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఒడిశా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. ప్రాజెక్టు యథావిధిగానే కొనసాగుతుందని, మార్పులు ఏమి చేయలేదని కోర్టుకు వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభ్యంతరాలు, సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా ఏపి ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. సమగ్ర వివరాలతో ప్రాజెక్టుకు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఇందుకుగానను ఏపి ప్రభుత్వానికి రెండు వారాలపాటు గడువును నిర్దేశించింది. అంతేకాకుండా విచారణను కూడా రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. అయితే మణుగూరు ప్లాంట్‌, గిరిజనులకు ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపి ప్రభుత్వాన్ని కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/