ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసు

ఎంసీడీ ఎన్నికల జాప్యంపై ఆప్‌ పిటిషన్‌

Supreme Court Notice to Lt Governor of Delhi

న్యూఢిల్లీః ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న జాప్యంపై నోటీసులో వివరాలు కోరింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల జాప్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం ఎల్‌జీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.

డిసెంబరు 7న ప్రకటించిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 డివిజన్లలో, బీజేపీకి 104 డివిజన్లలో విజయం సాధించాయి. ఆప్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ తాత్కాలిక ప్రొటెం పర్సన్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియమించి కార్పొరేటర్ల ప్రమాణాలు చేపడుతున్నారు. అయితే, కార్పొరేటర్ల కన్నా ముందుగా నామినేటెడ్‌ సభ్యుల ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది. మేయర్‌ పీఠంపై కన్నేసిన బీజేపీ.. ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ వస్తున్నది. దాంతో ఢిల్లీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండిగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ఆందోళనలు, గందరగోళం మధ్య జనవరి 6, 24 తేదీల్లో, ఈ నెల 6 న వాయిదా పడ్డాయి.

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి తాను నామినేట్ చేసిన సభ్యులకు ఓటు వేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆప్‌ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎంసీడీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వీ ఆప్‌ తరఫున వాదనలు వినిపించారు. దీనిపై విచారణను చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహా, జస్టిస్‌ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎల్జీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.