ఏపి ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ ఎత్తిపోతల పథకంపై పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు ఇవ్వగా, ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపి సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగ్గా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమని ఏపి సర్కారు వాదించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం పథకం తీరుస్తుందని వివరించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరింది. దీనిపై జస్టిస్ నారిమన్ ధర్మాసనం స్పందిస్తూ…. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

అటు, రాష్ట్ర హైకోర్టులోనూ ఏపి సర్కారుకు నిరాశ తప్పలేదు. పోలవరం నిర్వాసితుల సమస్యపై దాఖలైన పిల్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పోలవరంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. అధికారుల వద్ద సమస్యకు పరిష్కారం లభించకపోతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/