కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..సుప్రీం

నివేదిక ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం

supreme court
supreme court

న్యూఢిల్లీ: భారత్‌లో పలు నగరాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డిసెంబర్ లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలని సూచించింది.

ఇతర రాష్ట్రాలకు కూడా ఇవే ఆదేశాలను జారీ చేసింది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని, సహకారాన్ని కోరుకుంటున్నాయో కూడా నివేదికలో పేర్కొనాలని తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. కరోనాపై పూర్తి స్థాయిలో యుద్ధం చేయకపోతే… డిసెంబర్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

గుజరాత్, ఢిల్లీ, అసోం, మహారాష్ట్ర రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 44,059 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 91 లక్షలను దాటింది. త్వరలోనే సెకండ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/