సీట్ల‌ను ఖాళీగా ఉంచి ఏం చేయాల‌నుకుంటున్నారు : సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

నీట్ పీజీ మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీపై భార‌త వైద్య మండ‌లి, కేంద్రం పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

న్యూఢిల్లీ : పీజీ మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీకి సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు… కేంద్ర ప్రభుత్వం, భార‌త వైద్య మండ‌లి (మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ల‌పై నేడు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆలిండియా వైద్య కళాశాల‌ల్లో 1,456 పీజీ మెడిక‌ల్ సీట్లు ఖాళీగా ఉన్న వైనంపై స్పందించిన సుప్రీంకోర్టు… పీజీ మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీ, ఖాళీల‌కు సంబంధించిన అఫిడ‌విట్‌ను ఈ రోజే దాఖ‌లు చేయాల‌ని మెడిక‌ల్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్య‌వ‌హారంపై రేపే విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కూడా సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.

బుధ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా మెడిక‌ల్ కౌన్సిల్‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సీట్ల‌ను ఖాళీగా ఉంచి ఏం చేయాల‌నుకుంటున్నార‌ని వైద్య మండ‌లిని కోర్టు ప్ర‌శ్నించింది. విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆట‌లాడుతున్నారా? అంటూ వైద్య మండ‌లితో పాటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిలదీసింది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌క‌పోతే వైద్య మండ‌లి డీజీని కోర్టుకు పిలిచి ఆర్డ‌ర్ పాస్ చేయాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/