సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి అయ్యాయి. పద్మాలయ స్టూడియో నుండి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. నిన్నటి నుండి కూడా కడసారి కృష్ణ ను చూసేందుకు భారీగా సినీ , రాజకీయ ప్రముఖులు పోటీపడ్డారు. నిన్నంతా కూడా కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం ఉంచారు. ఈరోజు అక్కడి నుండి పద్మాలయ స్టూడియోకు తరలించారు. పద్మాలయ స్టూడియో లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

సూపర్ స్టార్ కృష్ణ కు నివాళ్లు అర్పించేందుకు వేలాదిమంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. అలాగే రాజకీయ ప్రముఖులు సైతం హాజరై కృష్ణకు నివాళ్లు అర్పించారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళసై పద్మాలయ స్టూడియో కు వచ్చి నివాళ్లు అర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి , ఆ తర్వాత పూజా కార్య క్రమాలు పూర్తి చేసారు. పూజా కార్య క్రమాలు అనంతరం అంతిమయాత్ర ప్రారంభించారు. మహా ప్రస్థానం లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ (80) మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాప సూచికంగా తెలుగు సినీ పరిశ్రమ బుధవారం బంద్‌ పాటించింది.