తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు

నేరెళ్ల శారద స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న సునీత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు (సునీతా మోగ్లీ ముదిరాజ్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు నేరెళ్ల శారద రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగగా, ఇప్పుడా స్థానంలో సునీత బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా శారద చేసిన సేవలను ఏఐసీసీ కొనియాడింది.

హైకోర్టు న్యాయవాది అయిన సునీత.. ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పీసీసీలో వివిధ పదవుల్లో ఆమె పనిచేశారు. కాగా, సునీత ఎంపికకు ముందు చాలా కసరత్తే జరిగింది. మొత్తం నలుగురు మహిళా నేతల వివరాలను తెప్పించుకున్న పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్.. వారిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. అనంతరం సునీతను ఎంపిక చేశారు. మహిళా సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉండడం, భాషపై పట్టుతోపాటు పార్టీకి విధేయురాలిగా ఉండడంతో ఆమెను ఎంపిక చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/