అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్‌ నశిస్తుంది

వెల్లడించిన అమెరికా పరిశోధకులు

corona virus
corona virus

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తుంది. అయితే ఈ వైరస్ మనుగడపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశోధనలో మరో కొత్త విషయం బయటపడింది. సూర్యరశ్మి, వేడి, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ త్వరగా బలహీనపడుతుందని పరిశోధకులు గుర్తించారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగంలోని ముఖ్య అధికారి ఒకరు మీడియాతో వెల్లడించారు. సూర్యకాంతికి వైరస్ వేగంగా నిర్జీవం అవుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విలియం బ్రయాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. లాలాజలం నుంచి వచ్చే తుంపర్లలోని కరోనా వైరస్ ఇంటిలోపలి ప్రదేశాలలోనూ, పొడి వాతావరణ పరిస్థితులలోను బాగా జీవించగలుగుతుందని తేలిందని ఆయన చెప్పారు. వెచ్చని వాతావరణంలో అంటువ్యాధులు ప్రబలే శాతం తక్కువగా ఉంటుందన్నారు. అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ ఆరు గంటలు మనగలిగిందని, అధిక తేమతోపాటు సూర్యరశ్మి కూడా సోకినప్పుడు రెండు నిమిషాల్లోనే దాని కథ ముగిసిందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/