సూర్యుడిని ఆపిన సుమతి

ఆధ్యాత్మిక చింతన

Sumati
Sumati

మహాపతివ్రతలకు సాధ్యం కానిది ఏదీ ఉండదు. అవసరమైతే మహామహులను సైతం శపించే శక్తి కలవారు పతివ్రతలు.

వనాలలో, అడవుల్లో సంచరించే తాపసుల చెంత వారికి వలసిన సేవలందిస్తూ పతివ్రతమైన స్త్రీలు పునీతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

భర్తలనే దైవంగా ఆరాధించే వీరికి పరదైవాలతో పనిలేదు. సీత, తార, అహల్య, ద్రౌపది, మండోదరిలను పంచ మహాపతివ్రతలుగా మన పురాణాలలో వారి ప్రస్తావనలు ఉంటాయి.

మహారాజ పుత్రిక అయిన సీత అన్ని భోగాలు విడనాడి శ్రీరాముని అడుగు జాడలననుసరించి అడవ్ఞలలో కష్టాలతో, కాలం గడిపింది. చేయని తప్పుకు బలై అహల్య శిలగా మారింది.

అయిదుగురు భర్తలున్న పాంచాలి భర్తల ఆజ్ఞను శిరసావహించి వారిని వెన్నంటి ఎన్నో కష్టాలనెదుర్కొన్న మహాపతివ్రత.

దుష్టుడైన రావణుడి సతి మండోదరి ఆయనను మంచి దారిలో పెట్టే హితోక్తులతో పతిని రక్షించుకోవాలనే ప్రయత్నాలు ఎన్నో చేసిన ఆదర్శ మహిళ.

అలాగే చంద్రుని భార్య తార, అనసూయలు పాతివ్రత్యంలో అగ్రగాములుగా కీర్తిగాంచారు.

కౌశికుని భార్య సుమతి భర్త వ్యసనాలన్నింటినీ భరించి ఆయనను ఏ మాత్రం వ్యతిరేకించక భక్తి శ్రద్ధలతో కౌశికుడి కామనలన్నీ తీర్చే మార్గాలలో నిమగ్నమయింది.

కుష్టురోగియైన కౌశికుడిని అసహ్యించుకోకుండా ఆయనకు అన్నపానాలను సమకూర్చింది.

వ్యాధిగ్రస్తుడయినా తనను తను మెచ్చిన వారకాంత వద్దకు తీసుకుని వెళ్లమని సుమతి వద్దంటున్నా వినని కౌశికుడిని ఒక బుట్టలో కూర్చోబెట్టి ఆ బుట్టను తన తలపై మోసుకుని వెళ్లే వేళలో మరణబాధ పడుతున్న మాండవ్ఞ్యడి కాలు తొక్కిన కౌశికుడిని సూర్యోదయం కాగానే మరణించాలని శపిస్తాడు మాండవ్ఞ్యడు.

దారుణంగా తన పతిని శపించిన మాండవ్ఞ్యడి శాపానికి ఆగ్రహించిన సుమతి సూర్యుడినే ఉదయించరాదనే శాపంతో శాసిస్తుంది.

ఆ తరువాత అంధకారబంధురమైన లోకానికి వెలుగు ప్రసాదించాలని తన శాపాన్ని ఉపసంహరించుకోవాలని అత్రి పత్ని అనసూయ కోరుతుంది.

సూర్యోదయం ఆపిన సుమతి తిరిగి సూర్యుడిని ఉదయించేలా చేయడంతో కౌశికుడు మరణిస్తాడు. పతివ్రత సుమతి ప్రార్ధనతో అనసూయ తన మహిమతో తిరిగి కౌశికుడికి ప్రాణదానం చేస్తుంది.

ఇలా భర్త ఎలాంటి వాడైనా వారి క్షేమాన్ని కాంక్షిస్తూ కాపాడే సుమతి వంటి పుణ్యవతులు మహాపతివ్రతల కోవలో నిలిచి పవిత్రమైన పురాణగాధలకు ప్రతీకలై నిలిచారు.

  • యం.వి.రమణకుమారి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/