ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మాజీ అధ్యక్షుడి కుమార్తె

20 ఏళ్లుగా హిందూమతం పట్ల ఆసక్తి కలిగిన ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కుమార్తె సుకర్ణోపుత్రి

జకార్తా: ఇండోనేషియా మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో కుమార్తె సుక్మావతి సుకర్ణోపుత్రి హిందూమతాన్ని స్వీకరించారు. ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారారు. ఆమె వయసు 69 ఏళ్లు. సుధీవాడని ఆచారం ప్రకారం నిర్వహించిన వేడుకలో ఆమె హిందూమతాన్ని స్వీకరించారు. బాలీలోని బులెలెంగ్ రీజెన్సీలో తన తండ్రి పేరుమీదున్న సుకర్నో సెంటర్ హెరిటేజ్ ఏరియాలో ఈ వేడుక జరిగింది. అయితే బాలీలో హిందూమతం మన దేశంలో ఆచరించే హిందూమతానికి భిన్నంగా ఉంటుంది.

సుక్మావతికి గత 20 ఏళ్లుగా హిందూమతం పట్ల ఆసక్తి ఉంది. బాలీలోని అన్ని ప్రధాన హిందూ దేవాలయాలను ఆమె దర్శించారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను చదివారు. హిందూమత సిద్ధాంతాలు, ఆచారాల గురించి ఆమెకు చాలా అవగాహన ఉంది. డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియా స్వేచ్ఛ పొంది, స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆమె తండ్రి సుకర్ణో తొలి దేశాధ్యక్షుడు అయ్యారు. 1945 నుంచి 1967 వరకు పదవీచ్యుతుడు అయ్యేంత వరకు 22 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. సుక్మావతి అక్క మెగావతి సుకర్ణోపుత్రి ఇండొనేషియా ఐదవ అధ్యక్షురాలు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/