ఆత్మహత్య, విడాకులు పరిష్కారం కాదు!

వ్యధ: వ్యక్తిగత సమస్యలకు పరిష్కార వేదిక

divorce not the answer
divorce not the answer

ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నది కొందరి విషయంలో నిజమనిపిస్తుంది.

ఒకరి భర్తను మరొకరు మందు పెట్టి మాయ చేసి వశం చేసు కోవడం చాలా దారుణం.

భర్త పిల్లలు ఉన్నప్పటికి కోర్కెలు తీర్చుకోడానికో లేక ఆర్థిక అవసరాలు తీర్చు కోడానికో పరాయి స్త్రీల భర్తలకు వలవేసే నెరజాణలు అక్కడక్కడా తారసపడుతున్నారు.

సంసారాలు కూల్చే ఇలాంటి కుటిల మహిళల్ని ఏమనాలో తెయడం లేదు. ఓ మహాతల్లి నా భర్తకు మందూపెట్టి వలలో వేసుకున్నది. ఆమె మాయలో పడినప్పటి నుంచి మా వారు నన్ను, పాపను సరిగా పట్టించుకోవడం లేదు.

పైగా ఆమెతో తిరగడానికి, ఆమెను పోషించడానికి శక్తి మించి అప్పులు చేసి మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు.

ఆమెను నిలదీస్తే ‘ నీ భర్తను నీవు నియంత్రించుకో నా జోలికి వస్తే మంచిదికాదు అంటూ నన్నే బెదిరిస్తోంది.

మా వారిని ప్రాధేయపడినా, భయపెట్టినా ప్రయోజనం లేకుండా పోతున్నది. విడాకులైనా ఇస్తాను కాని ఆమెను వదులుకోనని తేల్చి చెప్పాడు.

మాపాపను తీసుకెళ్లి, అమ్మకు అప్పగించి ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. దేవుడు నన్ను చావనీయకుండా బ్రతికించాడు.

నేను నిద్ర మాత్రలు వేసుకుని ఎంతకూ లేవకపోవడం గమనించిన అమ్మ,నాన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి బ్రతికించారు. భర్త ఎలాంటివాడైనా బిడ్డకోసం బ్రతకమని ఇరుగు,పొరుగు హితవు చెప్పారు.

నాలుగు ఇళ్లలో పాచిపని చేసైనా బిడ్డను పెంచి పెద్ద చేయాలని సూచించారు. నేను కూడా ఆలోచించి బిడ్డకోసం బ్రతకాలని, పాపకు తండ్రికావాలని మనసును చంపుకుని భర్త దగ్గరికి చేరాను.

ఆయన్ని మార్చుకుందామని ప్రయతించినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఈ మధ్య అప్పుల వాళ్ల తాకిడి పెరిగింది. ఏమి చేయాలో పాలు పోవడం లేదు.

నా వయస్సు 27 ఏళ్లు. మధ్యతరగతికి చెందిన కుటుంబంలో మూడవ సంతానంగా జన్మించాను. ఇద్దరు అక్కలకు పెళ్లి చేయడంతోనే మా నాన్న అప్పుల పాయ్యాడు. దీంతో నన్ను పై చదువులు చదివించలేక ఇంటర్‌తో ఆపేశారు.

నా ఇష్టంతో దూరవిద్యద్వారా డిగ్రీ పూర్తిచేశాను. అయినా ఆర్థిక సమస్యలవల్ల డిగ్రీవరకు చదివి, ప్రైవేటు సంస్థలో గుమాస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లాడవలసి వచ్చింది.

మూడేళ్ల క్రితం నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. నేను ఉద్యోగప్రయత్నాలు చేస్తుండగానే గర్భవతినయ్యాను. దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మానేసి ఇంట్లోనే ఉన్నాను.

పాప పుట్టిన తరువాత ఆమెను చూసుకోవాల్సి రావడంతో ఉద్యోగ ప్రయ త్నం చేయలేదు. ఈ దశలో మావారు ఒకామె మోజులో పడ్డారు.

ఆఫీసులో ఆలస్యమయ్యిందని, ఆఫీసుపనిగా బయటికి వెళ్లాల్సి వచ్చిందని చెపుతూ ఆమెతో తిరగడ ప్రారంభించాడు.

విషయం తెలిసి నిలదీస్తే కొత్తలో బుకాయించాడు. నాకు అనూనం జబ్బు ఉదంటూ సైకాలజిస్టువద్ద కౌన్సెలింగ్‌ చేయించారు. రాను రాను ఆయన వ్యవహారం బయపడింది. రంకు,బొంకు చాలా రోజులు దాగవని రుజువయ్యింది.

ఒకరోజు ఆమెతో పాటు ఓ పార్కులో ఉండటం నా కళ్లపడటంతో చేసేదిలేక ఒప్పుకున్నారు. నేను సరిగా సహకరించక పోవడంవల్లనే దారి తప్పానంటూ నెపం నామీదకు నెట్టారు.

నేను ఏడ్చి బాధపడగా మారిపోతానని ప్రమాణం చేశారు. అయినా కుక్కతోక వంకర పోదన్నట్లు ఆయన తీరు మార లేదు.

వారం క్రితం మావారు ఆమెతో పాటు గుడికి వెళ్లి, తిరిగి వస్తూ బండి యాక్సిడెంట్‌ కావడంతో ఇద్దరికి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది.

దీంతో విషయం ఆమె భర్త తల్లిదండ్రులు, మా కుటుంబసభ్యులకు తెలిసి పోయింది.

ఆయనకు అప్పులు ఇచ్చినవారు ఇంటికి వచ్చి గొడవపడ్డారు. దీంతో మా అమ్మ, నాన్నా, మామ తదితరాలను పిలిచి, ఆరా తీయగా ఆయన మూడులక్షల కుపైగా అప్పు చేసిివున్నట్లు తెలిసింది.

ఇందులో ఒక లక్ష రూపాయలు బ్యాంకు రుణం కాగా మిగిలిన మొత్తం నలుగురైదుగిరి వద్ద ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి అప్పు చేశారని తెలిసింది.

ఇప్పుడు అన్ని విధాలా నష్టం జరిగింది.ఆమె మా వారికి మందుపెట్టి ఉంటుందని ఆ మందు తీయిస్తే మంచిదని కొదరు సలహా ఇస్తున్నా రు.

ఇలాంటి భర్తకు విడాకులు ఇవ్వడం మేలని ఒకరిద్దరి సలహా ఈ నేపధ్యంలో నాకు తగిని సరిష్కార మార్గం చూపండి. -కుమారి, నెల్లూరు.

అమ్మా, మీ సమస్య అర్థమైంది. మీ వారు పరాయి స్త్రీ వ్యామోహంలో పడి మీకు ద్రోహం, నష్టం కలిగించారనడంలో సందేహం లేదు.

అయితే ఇందుకు మరొక స్త్రీని నిందించడం కూడా మంచిది కాదు. కొందరు స్త్రీలు పరాయి పరుషులకు మందుపెట్టి వశం చేసుకుం టారనడం కేవలం అభూతక ల్పనగానే భావించాలి.

వివాహేతర సంబంధాలు కొనసాగించేవారిలో వ్యక్తిత్వ, ప్రవర్తనాలోపాలు ఉంటాయి. అలాగే శృంగారపఠిమై విపరీత లక్షణాలు ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి వారికి ఎవరో మందుపెట్టి మాయ చేయవలసిన అవసరం లేదు.

విలువలకు తిలోదకాలు ఇచ్చి తిరగాలనుకునే వారికి ఎలాంటి మందులు అవసరం లేదు. మోజు తీర్చడమే మందని భావించాలి. కోర్కె, మోహం, అవసం అవకాశం వీరిని దారితప్పేలా చేస్తాయి.

భార్య ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఇలాంటి భర్తలు మారుతారనడానికి గ్యారెంటీలేదు. భర్య చనిపోతే ఇంకా స్వేచ్చగా తిరుగుతారు.

కాబట్టి ఆయనకు, ఆమె మందు పెట్టి ఉంటుందన్న అపోహలు వీడి మీవారికి కౌన్సెలింగ్‌ చేయించండి.

మీరు కూడా కౌన్సెలింగ్‌ తీసుకోండి. ఒక వేళ ఆయనలో ఏవైనా విపరీత శృంగార వాంఛలు ఉన్నట్టు అయితే సెక్స్‌ నిపుణుల ద్వారా చికిత్స చేయించండి.

అంతే తప్ప, ఆత్మహత్య, విడాకులు దీనికి పరిష్కారం కాదని గుర్తించండి. మీ వారిని మార్చుకుని మీ పాపును పెంచి పోషించడానికి సైకాలజిస్టు సలహాలను పాటించండి.

అలాగే అప్పులు తీర్చడానికి ఉన్న మార్గాలు అన్వేషించండి. సామరస్రంగా సమస్యలను పరిష్కరిం చుకుని, సానుకూలంగా బ్రతకడానికి ప్రత్నించండి.

  • -డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,సైకాలజిస్టు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/