సుధీర్ బాబు కామెంట్స్ కు సిగ్గుపడ్డ కేటీఆర్

హైదరాబాద్ లో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు హీరో సుధీర్‌బాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సరదా వ్యాఖ్యలకు వివరణ కూడా ఇచ్చారు. సుధీర్ బాబు మాటలు విన్న కేటీఆర్.. నవ్వుతూ ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు సుధీర్ బాబు. ఇరువురు మధ్య జరిగిన సంభాషణలు.. ఇండియా జాయ్‌లో కొద్దిసేపు నవ్వులు పూయించాయి.

మంత్రి కేటీఆర్‌కు నేను అభిమానిని. ఆయనలో మంచి రాజకీయ నాయకుడితో పాటు నటుడు కూడా ఉన్నారు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడి పాత్ర చేయాల్సి వస్తే కేటీఆర్‌నే అనుకరిస్తా. కేటీఆర్‌ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉంది’ అని అంటూ సుధీర్ చమత్కరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఇది కాంప్లిమెంట్ ఎలా అవుతుంది సుధీర్.. అని చమత్కరించారు.

కేటీఆర్ కామెంట్‌పై సుధీర్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలను తాను పాజిటివ్‌ దృక్పథంతోనే చేస్తున్నానని, మంచి రాజకీయ నాయకుడిలో మంచి యాక్టర్‌ ఉంటారని పేర్కొన్నారు. నటుడు ఏదైనా కొత్త సినిమా చేస్తున్నప్పుడు అన్నీ మరిచిపోయి ఆ పాత్రకు తగినట్టుగా మారి నటించాల్సి ఉంటుందని, అలాగే రాజకీయ నాయకుకు కూడా ప్రజాసేవ చేయాలంటే.. తన గురించి, కుటుంబం గురించి మరిచి పోయి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సుధీర్‌బాబు వ్యాఖ్యలపై కేటీఆర్‌ కూడా అంతే సరదాగా స్పందించారు. ‘సుధీర్.. నీ మాటలు గుర్తుపెట్టుకుంటా’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుధీర్ చేసిన వ్యాఖ్యలను తాను పాజిటివ్‌గానే తీసుకుంటున్నానని చెబుతూ ఆయనకి ధన్యవాదాలు తెలిపారు.