సుభద్ర: ఆ ఘనతే ఊళ్లో వండర్‌ గర్ల్‌గా నిలబెట్టింది..

జీవన వైవిధ్యం

Subhadra: Wonder Girl in the village
Subhadra: Wonder Girl in the village

ఆర్యా రాజేంద్రన్‌ (21) గురించి ఆ మధ్య దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఆర్య చిన్న వయసులో తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికవడమే అందుకు కారణం. ఆర్య వయసు అమ్మాయే సుభద్ర. ఇరవై ఒక్కేళ్లు. అయితే తనేమీ రాజకీయాల్లో లేదు. తనింటి కోసం నాలుగు పనులు చేస్తోంది. ఆ ఘనతే ఆమెను ఊళ్లో వండర్‌ గర్ల్‌గా నిలబెట్టింది.

సుభద్ర పాఠాలు చెబుతుంది. డిగ్రీ చదివింది కనుక అంతవరకు ఒకే. అయితే అదొకటే ఆమెకు ఉపాధి కాదు. పొలం పనులు చేస్తుంది. పుట్టగొడుగుల సాగు పనులు చూస్తుంది. రైతుల్నించి పాలు సేకరించి డైరీలకు రవాణా చేయిస్తుంది. పిండి మర నడుపుతుంది. ఒడ్ల నుంచి పొట్టు తీస్తుంది. ఇంకా కొన్ని బండ పనులు, భారమయ్యే పనులు మీద వేసుకుంది. అన్ని పనులూ కుటుంబ పోషణ కోసం. సాధారణంగా గ్రామాల్లో ఈ తరహా పనులన్నీ మగవాళ్లే చేస్తారు.

ఒడిశా, జైపూర్‌ జిల్లాలోని మారుమైల గ్రామం ‘బందా సుభద్ర వాళ్లది. ఇంట్లో ఆమెతో కలిపి ముగ్గురే ఉంటారు. తండ్రి, అన్న తను. తల్లి లేదు. అన్నకు ఉద్యోగం లేదు. తండ్రి అప్పులు చేయడంతో అలా తీర్చందే ఆయన ఊరు దాటి వెళ్లని పరిస్థితి. పాడి రైతుల నుంచి పాలను చుట్టుపక్కల డెయిరీలకు సరఫరా చేసేవాడు. మరి పొట్టు తేసేవాడు, అలా కొంత డబ్బు వచ్చేది.

అన్న ఇంజినీరింగ్‌ చేసే సమయంలో తండ్రికి ఆ పనుల్లో సహాయం చేసేది సుభద్ర. ‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా.. అంటున్నా వినిపించుకునే కాదు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నాన్న కూలబడిపోతాడు. కూలబడే వరకు ఎందుకు చేయడం? అప్పు చేశాడాయన. ఆ అప్పు సంగతీ, అదింకా తీరని సంగతీ సుభద్రకు తెలుసు. పిల్లలిద్దరికి డిగ్రీ చేతికి వచ్చేసరికి అజ§్‌ుకి (సుభద్ర తండ్రి) అప్పు తీర్చాల్సిన నోటీసులు చేతికొచ్చాయి.

వాస్తవాన్ని గ్రహించింది సుభద్ర. అన్నయ్యని ఉద్యోగం వెతుక్కోమని చెప్పి తను ఊళ్లో పనుల్లో పడిపోయింది. అప్పు తీర్చడం, నాన్నకు సహాయంగా ఇంటిని నడిపించడం ఇప్పుడు ఆమె బాధ్యతలు. గత ఏడాదే సుభద్ర తమ గ్రామానికి దగ్గర్లోని ఛటియాలోని ఎం.హెచ్‌.డి. మహావిద్యాలయ కాలేజ్‌ నుంచి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది.

పేరుకు రెండు ఎకరాలున్నా, పంట దిగుబడులు లేవు.
వడ్ల పొట్టు తీసే మిషన్‌ సొంతదే అయినా కరెంట్‌ బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్‌ తీసేశారు. వేరే రాబడులూ తగ్గిపోయాయి. ఆ స్థితిలో తండ్రికి సహాయంగా కాక, ఇంటికి సహాయంగా దొరికిన పనులన్నీ మీద వేసుకుంది సుభద్ర.

ఊళ్లో వాళ్లు కూడా..

‘ ఆడపిల్ల ఇంత అలసిపోవడం ఏంటమా.. అని వారించారు. ఆమె వినలేదు. వినే పరిస్థితీ లేదు. తను ఇంటర్‌ చదివేటప్పటి నుంచే పిల్లలు పాఠాలు చెబుతుండేది.
ఆ అనుభవంతో ట్యూషన్‌లు మొదలుపెట్టింది.

ట్యూషన్‌లు మొదలుపెట్టింది. ట్యూషన్‌లకు, తక్కిన పనులకు ఆమె చేసుకున్న సమయ విభజన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘అద్భుతమైన అమ్మాయి అనే మాటతప్ప ఆమెకు ఇంకే ప్రశంసాసరిపోదని అనిపిస్తుంది. సుభద్ర రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తుంది. పొలానికి వెళుతుంది. తొమ్మిది వరకు పొలం పనులు. ఇంటికొచ్చాక దైనందిన చర్యలు ముగించుకుని రైతుల్నించి పాలు సేకరించడానకి వెళుతుంది.

వాడుకకు కుదుర్చుకున్న వాహనాలలో ఆ పాలను డైరీలకు చేరుస్తుంది. తర్వాత వడ్ల పొట్టు తీసే పని, పిండి మర నడిపే పని. ఇవన్నీ ఉదయం 11 సాయంత్రం 6 ఆరు గంటలమధ్య జరిగిపోతాయి. మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే తమ పొలంలోని పుట్టగొడుగుల పంట బాగోగులు పరిశీలిస్తుంది. ఆరు తర్వాత ట్యూషన్‌కు వచ్చే 40 మంది పిల్లలతో మళ్లీ బిజీ.

ఆమె లెక్కలు వేసుకోలేదకానీ, నెలంతా ఇలా కష్టపడితే వచ్చేది దాదాపు 30 వేల రూపాయలు. డబ్బు కన్నా కూడా ఆమెకు ఒకటి అనుభవం అయింది. ‘కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకోవడమే జీవితం. జీవితమే ఉపాధి చూపిస్తుంది.ఈ వాస్తవాన్ని ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాలి. మగ పని అని చతికిలపడకుండా.. మనిషి పని అనుకుని గడపదాటాలి అంటుంది సుభద్ర. తనొక పెద్ద పారిశ్రామికవేత్త అయి, ఊరికి దగ్గరల్లో మంచి వృద్ధాశ్రమం నెలకొల్పాలని ఆమె ధ్యేయం.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/