బంజారాహిల్స్‌ ఆర్కే సినీ మ్యాక్స్‌ లో ప్రమాదం..గాంధీ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఆర్కే సినీమాక్స్‌ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్‌కు చెందిన 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థులు ఎస్కలేటర్‌పై ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిని విద్యార్థులను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేనను ఆదేశించారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజా ఘటనను దృష్టిలో ఉంచుకుని గాంధీ సినిమా థియేటర్లలో విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు.

కాగా ఈ ప్రమాద ఘటనపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గురువారం ఉదయం 9.50 గంటలకు భారతీయ విద్యాభవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో ఒక టీచర్‌ కూడా ఉన్నారు. వారికి సత్వర చికిత్స అందించాం. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. పరిస్థితి మెరుగయ్యాక మొత్తం 13 మంది బాధితుల్లో 9 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశాం. మరో నలుగురిని అబ్జర్వేషన్‌లో ఉంచాం. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు’ అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.