బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆందోళన

కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ రావాల్సిందే..విద్యార్థులు

బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సౌకర్యాల కొరత, యాజమాన్యం నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 6వేల మంది విద్యార్థులు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. వర్షం పడుతున్నా గొడుగులు పట్టుకొని ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు నిరసనలో పాల్గొనేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటివరకు తమ ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ఓ విద్యార్థి బాసర సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకురాగా.. ఆయన వెంటనే స్పందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారని రీ ట్వీట్ చేశారు. మంత్రి సబిత కూడా ఈ వ్యవహారంపై తాము దృష్టిసారించామని వెంటనే చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. అయితే తమకు స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు చెబుతున్నారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళనపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క్యాంపస్​కు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేయడంతో.. వారు పొలాల మీదుగా తమ పిల్లలను కలిసేందుకు రాగా అక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు పొలాల్లోనే కూర్చొని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వత వీసీ నియామకం జరపలేదు. దీనికి తోడు మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, యూనిఫాం డ్రెస్సుల పంపిణీ చేయడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని.. విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/