స్కూల్ కు వెళ్లొస్తానంటూ వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన బాలుడు

కరోనా ఉదృతి తగ్గడం తో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు..స్కూల్స్ ఓపెన్ కావడం తో సంతోషం గా స్కూల్ బ్యాగ్ వేసుకొని పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం ఎంతో సంతోషంగా తమ బిడ్డలను స్కూల్స్ కు పంపిస్తున్నారు. ఈ తరుణంలో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లొస్తానమ్మా అంటూ వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామానికి చెందిన సత్యాల శ్యాంప్రసాద్ దంపతులకు ఆభిషేక్ (11)తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అభిషేక్ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంటినుంచి పాఠశాలకు వెళ్లిన అభిషేక్ మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని మరుగుదొడ్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఎడమ చేతికి తేలు కాటు వేసింది.

తెలు కాటేసిన ఘటన గురించి తెలుసుకున్న ఉపాధ్యాయులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం కుటుంబసభ్యులు అనంతసాగరంలో ప్రాధమిక చికిత్స చేసి ఆత్మకూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా అభిషేక్ మార్గమధ్యంలో మృతి చెందారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం తో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు.