సీఎంఆర్ కాలేజీలో విషాదం : గుండెపోటుతో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మృతి

తెలంగాణ లో గుండెపోటుతో వరుసగా యువకులు మరణిస్తున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. గత పది రోజుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా..తాజాగా సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ మృతి చెందాడు.

రాజస్థాన్ కు చెందిన సచిన్ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈరోజు కాలేజీలో ఉదయం క్లాసులకు అటెండ్ అయిన సమయంలో కాలేజీ కారిడార్ లో నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే స్పందించి విశాల్ ను వెంటనే సీఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ స్టూడెంట్ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. సచిన్ మృతి విషయాన్ని అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు మేడ్చల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలా చనిపోయాడన్న విషయంపై డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సచిన్ గుండెపోటుతో కుప్పకూలిన విజువల్స్ కాలేజీ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇక తెలంగాణలో గత వారం రోజుల వ్యవధిలో ముగ్గురు , నలుగురు యువకులు మృతి చెందారు. మరోపక్క గుండెపోటు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. అలాగే, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఏర్పాటుచేసేందుకు 1400 పరికరాలకు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితులకు ఊపిరిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు.