బ్రిటన్‌ను ముంచేయనున్న సియారా తుఫాను

గంటకు 100 మైళ్ల వేగంతో గాలలు: యూకే వాతావరణ శాఖ

Storm Ciara which battered Britain with 100 mph
Storm Ciara which battered Britain with 100 mph

బ్రిటన్: బ్రిటన్‌ను సియారా తుఫాను వణికిస్తోంది. రానున్న 48 గంటల్లో సియారా తుఫాను విశ్వరూపం దాల్చనున్నట్లు యూకే వాతావరణ శాఖ తెలిపింది. సియారా తుఫాను ప్రభావంతో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భారీగా వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పిన వాతావరణ శాఖ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిదని బ్రిటన్ వాసులకు సూచించింది. ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వందల సంఖ్యలో విమానాలను నిలిపివేయడం జరిగింది. పలు రైళ్లను రద్దుచేయడం జరిగింది. సోమవారం రోజున గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్‌లలో మంచు తుఫాన్లు కూడా వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరించింది.ఇక రెండో రోజున దక్షిణ ఇంగ్లాండ్‌లో కూడా భారీగా గాలులు వీస్తాయని వెల్లడించింది. రైళ్ల సేవలను పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్న క్రమంలో తుఫాను మరింత అంతరాయం కలిగిస్తోందని నెట్‌వర్క్ రైల్ తెలిపింది. ఇప్పటికే ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకొరిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/